Breaking NewsEducationHome Page Sliderhome page sliderTelangana

తెలంగాణ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (ఫ్రెష్, రెన్యూవల్) దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 20వ తేదీతోనే ఈ గడువు ముగిసినప్పటికీ, వివిధ సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థుల సౌకర్యార్థం మే 31 వరకు సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పారదర్శకంగా ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ-పాస్ పోర్టల్‌ను నిర్వహిస్తోంది.గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 10,89,265 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం నమోదు చేసుకోగా, ఈ ఏడాది ఇప్పటివరకు 10,20,688 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దాదాపు 68,597 మంది అర్హులైన విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ వెల్లడించారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న నర్సింగ్, పారామెడికల్ పీజీ కోర్సుల డేటా ఇంకా ఈ-పాస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కాకపోవడం వల్ల ఈ ఆలస్యం జరిగింది. దీనికి తోడు ఏప్రిల్ మొదటి వారంలో మీ-సేవ పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలు కూడా ఒక ప్రధాన కారణం.అంతేకాకుండా, ఎస్ఎస్‌సీ పోర్టల్ అప్‌డేట్స్ కారణంగా డేటా బదిలీలో ఆలస్యం జరగడం, ఐడెంటిటీ కార్డు, ఆధార్, పదో తరగతి వివరాల మధ్య సరిపోలిక లేకపోవడం వంటి ఇతర అప్‌డేట్ సమస్యల వల్ల చాలా మంది విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మానవతా దృక్పథంతో గడువును పొడిగించింది. విద్యార్థులతో పాటు సంబంధిత కళాశాలల యాజమాన్యాలు, రెగ్యులేటరీ అధికారులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుని మే 31 లోగా డేటా అప్‌లోడ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.