Home Page SliderNational

ప్రధాని కావాలని పగటి కలలు కనడం మానేయండి

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీపై బీజేపీ విరుచుకుపడింది. ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కనే బదులు “అరాచకం”లోకి నెట్టబడుతున్న రాష్ట్రంపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ విమర్శించింది. బీజేపీయేతర పార్టీల కూటమిని సిద్ధం చేస్తున్న ప్రయత్నంలో నితీష్ కుమార్ ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారు. బదిలీలు, పోస్టింగ్‌లపై అధికారం అంశంపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రికి మద్దతుగా నితీష్ నిలిచారు. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఐతే ఈ భేటీపై బీజేపీ దుయ్యబట్టింది.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా మాట్లాడుతూ.. ఇతర నేతలను కలవడం నితీశ్‌కు హక్కు అని, అయితే ఆయన తన సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. నితీష్ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని, దానికి బదులు బీహార్ ముఖ్యమంత్రిగా తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ మయూఖ్ మాట్లాడుతూ ప్రధాని పదవి ఖాళీ లేనందున నితీష్ కుమార్ తన కలల ప్రపంచం నుండి బయటకు రావాలని అన్నారు. నేరాలు, అవినీతిలోకి మరింత లోతుగా నెట్టివేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా సేవల నియంత్రణపై కేంద్రంతో, ప్రభుత్వం కొనసాగుతున్న గొడవలో ఆయనకు “పూర్తి మద్దతు” అందించారు. నితీష్ తోపాటుగా డిప్యూటీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.