అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంకా మిగిలి ఉన్న మూడేళ్ల కాలంలోనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మంచి పనులు చేయాలని సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ హయాంలో భూముల ధరలు పెరిగి ప్రజల ఆస్తులకు విలువ వచ్చిందని, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రియల్ ఎస్టేట్‌ను తొక్కిపెట్టారని కేటీఆర్ విమర్శించారు. అప్పట్లో రూ. 5 లక్షలు ఉన్న భూమి రూ. 50 లక్షలకు చేరితే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రేట్లు పడిపోయి ప్రజల ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నాయని , ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు దేవుళ్లు, సోనియా గాంధీపై ఒట్టు వేసి ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని అడిగితే సీఎం బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లాగుల్లో తొండలు విడుస్తా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అనడం తప్ప రేవంత్ రెడ్డికి మరో భాష తెలియదని ఎద్దేవా చేశారు. రైతుల సంపదను పెంచిన రైతుబంధును అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పులపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక రకమైన అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాగ్ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ చేసిన అప్పు రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ నేతలు రూ. 8 లక్షల కోట్ల వరకు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.హైడ్రా పేరుతో కేవలం పేదల ఇళ్లను కూలగొడుతున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలంటూ అబద్ధాలు చెప్తున్నారని, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తూ రేవంత్ రెడ్డి ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎంకు ఏమీ తెలియదని, ఎవరైనా చెబితే వినే రకం కాదని కేటీఆర్ దుయ్యబట్టారు.

