NewsNews AlertTelangana

బయటకెళ్తే… కాంగ్రెస్ దెబ్బేంటో చూపిస్తాం…

Share with

మునుగోడు పంచాయతీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సాధ్యమైనంత వరకు సర్దిచెబుతాం….పార్టీలో కొనసాగితే ముందులాగే గౌరవిద్దాం… కాదనుకొని వెళితే కచ్చితంగా ఓడించాల్సిందేనని కాంగ్రెస్ నేతలు ఓ.. నిర్ణయానికి వచ్చారు టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని వ్యాఖ్యానించడంతో పాటు ఈడీ పిలిస్తే సోనియాగాంధీ,రాహుల్‌గాంధీ విచారణకు వెళ్లలంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది.

ఈ నేపధ్యంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ నివాసంలో ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారనే భావనకు ఆయా నేతలు వచ్చారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో చర్చించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా ఒక ఫార్ములాను తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి ఉపఎన్నికలు అనివార్యమైతే రాజగోపాల్‌రెడ్డికి పోటీగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దించేందుకు సిద్దం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నల్గొండ రాజకీయాల్లో ఓ చరిత్ర కానుంది. అయితే తన సోదరుడిపై పోటీ చేసేందుకు వెంకటరెడ్డి ఓకే అంటారా..? లేక ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే విషయంపై ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మార్పు గురించి పునరాలోచన చేయాలని.. సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క కోరారు. రాజగోపాల్‌ రెడ్డి సేవలు కాంగ్రెస్‌కు అవసరమన్నారు. కాంగ్రెస్‌ పట్ల ఆయనకు గౌరవం ఉందని, కొన్ని విషయాల్లో రాజగోపాల్‌ రెడ్డికి సమస్యలు ఉన్నాయన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయని భట్టి విక్రమార్క తెలిపారు.