Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNewsNews Alert

ఆరోపణలు నిరూపించాలి: గళ్లా మాధవి

గుంటూరు: గుంటూరులో మహిళపై జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్రంగా ఖండించారు. నిందితులను కాపాడేందుకు తాను ఒత్తిడి తెచ్చానని, తన వల్లే కేసు నమోదు ఆలస్యమైందన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన గళ్లా మాధవి, ఘటనపై అంబటి రాంబాబు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సంఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షిలా మాట్లాడటం, పోలీసులపై, తనపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. తప్పుడు ప్రచారం చేసి, అదే అంశంపై విచారణ కోరడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని, ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం సరికాదని ఆమె అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను అంబటి రాంబాబు ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. అలా చేయలేకపోతే ఆయనపై చట్టపరంగా పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికల్లోనూ తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని గళ్లా మాధవి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఈ ఘటనను ఉపయోగించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబును ఆమె డిమాండ్ చేశారు.