Home Page SliderNationalNews AlertTrending Today

వర్షంపై ఐఐటీఎం ఆసక్తికర నివేదిక

భారతదేశంలో నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే వర్షంలో దాదాపు 25 శాతం నీరు నేలను తాకకముందే గాలిలో ఆవిరైపోతున్నట్లు పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ (IITM) శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడించింది. వర్షపు చినుకులు గాల్లోనే ఎంత మేర ఆవిరవుతున్నాయో ప్రత్యక్ష పరిశీలనల ఆధారంగా అంచనా వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. శాస్త్రవేత్తలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలపై దశాబ్దకాలంగా సేకరించిన వర్షపాతం, వాతావరణంలోని ఐసోటోప్ డేటాను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. వర్షపు చినుకులు మేఘాల నుంచి కిందికి వస్తున్న సమయంలో వాటి చుట్టూ ఉన్న వేడి, పొడి గాలి ప్రభావంతో కొంత నీరు నేలను చేరకముందే ఆవిరైపోతుందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా చిన్న పరిమాణంలో ఉండే వర్షపు చినుకులు ఎక్కువగా ఆవిరయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ ఆవిరీకరణ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండదని అధ్యయనం వెల్లడించింది. తేమ అధికంగా ఉండే పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కేవలం 4 నుంచి 6 శాతం వర్షమే గాల్లో ఆవిరవుతుండగా, పొడి వాతావరణం ఉండే రాజస్థాన్ వంటి వాయవ్య భారత ప్రాంతాల్లో అది 40 శాతం వరకు నమోదవుతోంది.

ఈ పరిశోధన వాతావరణ అంచనాలను మరింత ఖచ్చితంగా రూపొందించడంలో కీలకంగా ఉపయోగపడనుంది. రుతుపవనాల గమనాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడంతో పాటు వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.