చైనా – ఇరాన్ డీల్‌పై ట్రంప్ రియాక్షన్
ఇరాన్‌కు చైనా నుంచి అత్యాధునిక షోల్డర్ -ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరా జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ ఆయుధాలను పాకిస్థాన్ మార్గంగా ఇరాన్‌కు తరలించే ప్రణాళిక ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కథనాల ప్రకారం, 60 మిలియన్ డాలర్లకు పైగా విలువైన సుమారు 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్ గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు ఈ ఆయుధాలను వినియోగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ క్షిపణులను భూమార్గంలోనా, గగనమార్గంలోనా తరలిస్తారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు, ఈ వార్తలను చైనా ఖండించింది.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాల సరఫరా జరుగుతోందన్న వార్తలు తనను నిరాశకు గురి చేశాయని చెప్పారు. ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే ఇరాన్‌కు చైనా, రష్యా ఆయుధాలు సరఫరా చేయవద్దని ఇటీవలే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు.

