Andhra PradeshHome Page Slider

తెలుగుదేశం జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు

రానున్న ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తులు మొదలుపెట్టాయి. ప్రస్తుతం మినీ మ్యానిఫెస్టో ను రూపొందించి ఆ తర్వాత అన్ని వర్గాల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని వచ్చిన విజ్ఞప్తులు వినతులు ప్రతిపాదనల ఆధారంగా పూర్తి మేనిఫెస్టోను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాయి. పొత్తుల ప్రకటన అనంతరం తెలుగుదేశం జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటికి రెండుసార్లు సమావేశమై మేనిఫెస్టో రూపకల్పన పై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో రూపకల్పనకు రెండు పార్టీల నుంచి ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సోమవారం తొలిసారిగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయింది. తెలుగుదేశం పార్టీ తరఫున యనమల రామకృష్ణుడు నేతృత్వంలో అశోక్ బాబు, పట్టాభి జనసేన తరఫున ముత్తా శశిధర్ నాయకత్వంలో వరప్రసాద్, శరత్ కుమార్ లు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. మొత్తం 11 అంశాలతో మినీ మేనిఫెస్టో ప్రకటించాలన్న నిర్ణయానికి మేనిఫెస్టో కమిటీ వచ్చింది.