వినాయక చతుర్థి పూజ శుభముహుర్తం ఎప్పుడు, ఎలా చేయాలి.
వినాయకుడు విఘ్నాలకు అధిదేవత, చదువులనిచ్చే వేలుపు. దేవతలలో తొలిపూజ గణేషునిదే. గణాలకు గణనాధుడు ఆయనే. వినాయక చవితి వస్తోందంటే చాలు ఇంట్లో చిన్నా, పెద్దా సహా అందరూ చాలా హడావుడిగా పండుగ సంబరాలు మొదలు పెడతారు. వీదుల్లో, వాడల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూంటారు. పిల్లలయితే తమ పుస్తకాలు పూజలో పెట్టి మంచి ర్యాంకులు సాధించినట్లు మురిసిపోతారు.

వినాయకుని పుట్టుక
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున గణపతి జన్మించాడని నమ్ముతారు. పురాణాల ప్రకారం పార్వతి స్నానం చేయబోతూ పసుపుతో ఒక బొమ్మను తయారుచేసి ప్రాణప్రతిష్ట చేసిందని నమ్మకం. తర్వాత పరమశివుడు ఆగ్రహంతో కుమారుని తలను తీసివేసి, ఏనుగు తలను అమర్చాడని అంటారు. ఇలా వినాయకునిపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు నెలలోనే 31 వతేదీ, బుదవారం నాడు వినాయక చవితి పండుగ జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా లంబోదరునికి ఏ వస్తువులు సమర్పించాలి. పూజ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, వినాయక ప్రతిమను ఏసమయంలో ప్రతిష్టించాలో తెలుసుకుందాం.
విగ్రహ ప్రతిష్ట శుభ ముహుర్తం
మన హిందూ పంచాంగం ప్రకారం ఆగస్టు 30 వతేదీ మధ్యాహ్నం 3.34 గంటలకు చతుర్థి తిథి ప్రారంభమై, ఆగస్టు 31 మధ్యాహ్నం 3,23 గంటలకు ముగియనుంది. గణేశ్ మండపాలలో ప్రతిమలను 31 వతేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1.30 గంటల మధ్యలో ప్రతిష్టించి, పూజలను ప్రారంభించినట్లయితే మంచిదని పండితుల అభిప్రాయం.
ఏ దిశలో ప్రతిష్టించాలి
వాస్తు శాస్త్రం ప్రకారం గణేశుని ప్రతిమ ముఖం ఇంటి లోపలి వైపుకు చూసేలా ఉండాలి. దక్షిణ దిశకు తిప్పి ఎట్టి పరిస్థితుల్లో పూజించరాదు. తూర్పు వైపున గానీ, ఈశాన్యం పైపునకు గానీ, ఉత్తర దిక్కునకు గానీ ప్రతిష్టించి పూజించడం వలన శుభఫలితాలను పొందవచ్చు.
అలాగే వినాయకుని తొండం ఎడమవైపునకు ఉంటే ఆఇంట్లో విజయం,సంపద, ఐశ్వర్యం వర్థిల్లుతాయని నమ్మకం. ముఖ్యంగా వినాయకుని విగ్రహం వద్ద మూషికం (ఎలుక) కూడా ఉండేలా చూసుకోవాలి. అలాగే వినాయకుని ప్రతిమ అందంగా, పరిపూర్ణంగా, ఎక్కడా విరగకుండా ఉండేలా చూసుకోవాలి.

నైవేద్యాలు
గణేశుని పూజలో అత్యంత ప్రధానం మోదక నైవేద్యం. ఇంకా ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డూలు మొదలైనవి కూడా వినాయకునికి ఇష్టమైనవని అంటారు. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయలు, వెలక్కాయలు, గరిక, పత్రి, పూలు, పాలవెల్లి మొదలైనవి తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు.
వినాయక ప్రతిమ
వినాయక చవితి రోజున తప్పనిసరిగా మట్టి ప్రతిమను మాత్రమే పూజించాలి. రోజూ చేసుకునే పూజలో రాగి, వెండి వంటి ప్రతిమలను పూజించినా, చవితి పర్వదినాన మాత్రం తప్పకుండా మట్టి వినాయకుని మాత్రమే పూజించాలి. పర్యావరణానికి హాని కలిగే రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మొదలైన వస్తువులు ఉపయోగించక పోతేనే మంచిది. మట్టి ప్రతిమను నీటిలో నిమర్జనం చేస్తే చాలా మంచిది. కొందరు మూడు, ఐదు, ఏడు, లేదా తొమ్మిది రోజులపాటు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మనం కూడా ఈ నియమాలు పాటిస్తూ చక్కగా ఆ గణేషుని పూజించుకుని, ఆ వినాయకుని ఆశీస్సులు అందుకుందామా..