Andhra PradeshHome Page Slider

అసలు యుద్ధం రేపట్నుంచి, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రక్రియ షురూ

Share with

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రేపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపట్నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటుగా, తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా, నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాలు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఆ తర్వాత ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఏపీ, తెలంగాణలో లోక్ సభ మే 13న ఒకేరోజు ఎన్నిక జరగనుంది. అన్ని దశలు పూర్తి కాగానే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహిస్తారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరో ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో పోటీ జరగనుంది. నాలుగో దశలో ఏపీ అసెంబ్లీతోపాటుగా 25 ఎంపీ, తెలంగాణ 17 ఎంపీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుంది. వాటితోపాటుగా, మహారాష్ట్రలో 11, బీహార్‌లో 5, మధ్యప్రదేశ్‌లో 8, యూపీలో 13, ఒడిశాలో 5, పశ్చిమ బెంగాల్‌లో 8, జార్ఖండ్‌లో 3, జమ్మూ కాశ్మీర్ ఒక స్థానానికి ఎన్నిక జరుగుతుంది.