Andhra PradeshHome Page Slider

యుద్ధం మొదలు… ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Share with

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశల్లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత కలెక్టరేట్‌లో, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ప్రధాన కార్యాలయంలో తమ నామినేషన్‌లను దాఖలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతిస్తామని, రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేయవచ్చని చెప్పారు. సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి పోటీదారులు తమతో పాటు నలుగురిని తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. మిగిలిన మద్దతుదారులను RO కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఆపివేస్తారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి అభ్యర్థులు RO కార్యాలయానికి చేరుకోవడానికి కేవలం మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తారు.

లోక్ సభ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా తప్పనిసరిగా రూ 25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అయితే అసెంబ్లీకి ₹ 10,000 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థుల మొత్తం సెక్యూరిటీ డిపాజిట్‌‌లో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించాలని ఏపీ సీఈవో పిలుపునిచ్చారు. నామినేషన్లు స్వీకరించే కార్యాలయంలో దాని ప్రవేశద్వారం వద్ద ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నామినేషన్ల దాఖలుకు వెళ్లేటప్పుడు ఊరేగింపులు నిర్వహిస్తే వాటిని వీడియో రికార్డ్ చేస్తామన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 13 రకాల డాక్యుమెంట్లు జతచేయాలని సూచించారు. లోక్ సభకి పోటీ చేసేవారు ఫారమ్-2 A, అసెంబ్లీ ఫారం-2 B కోసం నింపాలి. అన్ని నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, ప్రభుత్వ సెలవు దినాలలో మినహా, నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను RO లేదా AROకి ఫైల్ చేయొచ్చు. అభ్యర్థులు నేరుగా లేదా ప్రపోజర్ ద్వారా నామినేషన్ పత్రాలను కూడా సమర్పించవచ్చు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో హెల్ప్ డెక్‌లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నామినేషన్‌లను దాఖలు చేయడానికి సువిధ యాప్‌ను ఉపయోగించవచ్చు. కానీ వారు హార్డ్ కాపీని భౌతికంగా ROకి సమర్పించాల్సిందే. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల స్వీకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 18న, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ-ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన-ఏప్రిల్ 26, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29, పోలింగ్ మే 13న, కౌంటింగ్‌ జూన్‌ 4న.

ఇదిలా ఉండగా, వైఎస్సార్‌సీతో సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఒకటి, రెండు చోట్ల అభ్యర్థులను పార్టీలు మార్చే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కల్యాణ్, బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల ప్రచారం చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ అధినేత కూటమితో ప్రయోగం చేస్తుంటే, వైసీపీ మాత్రం సింగిల్ గా బరిలో దిగగా, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను కలుపుకొని వెళుతోంది.