కాళేశ్వరంపై సీఎంకు రామచందర్ లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్డీఎస్ఏ (NDSA) సిఫారసులను సకాలంలో అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు సాగునీరు అందడం లేదని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, అందుబాటులో ఉన్న సాంకేతిక అవకాశాలను ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం నీటిని సాగుకు ఉపయోగించాలని సీఎంను కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన రామచందర్‌రావు, ప్రభుత్వం మొండి వైఖరి వీడి రైతుల ప్రయోజనాల కోసం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

