Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

విషం తాగి రాజ్‌కుమార్ బలవన్మరణం

తెలుగు రాష్ట్రాలను కలిచివేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు పంజాల రాజ్‌కుమార్ (31) మృతి చెందాడు. మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అతడు, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పెంజర్ల అతని మేనమామ ఊరు కాగా, మృతదేహం పక్కనే విషపు సీసా లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మూడు రోజుల క్రితం షాబాద్ మండల కేంద్రంలో రాజ్‌కుమార్ ఒకే రోజు ఆరుగురిని కత్తితో దారుణంగా హత్య చేశాడు. గతంలో తనపై నమోదైన పోక్సో కేసుకు కారణమని భావించిన కుటుంబంపై కక్ష పెంచుకున్న అతడు, బాలిక, ఆమె తల్లి, నానమ్మను హత్య చేశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య సరిత, ఇద్దరు కుమారులను కూడా కత్తితో చంపి పరారయ్యాడు.

పోలీసుల విచారణలో రాజ్‌కుమార్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్ చదివే రోజుల్లో తన ట్యూషన్ టీచర్ అయిన సరితను ప్రేమించి 2018లో వివాహం చేసుకున్నాడు. అనంతరం డ్రైవర్‌గా పనిచేస్తూ జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మద్యానికి బానిసై భారీగా అప్పులు చేశాడు. అప్పుల భారం, కుటుంబ కలహాలు, పోక్సో కేసు, భార్య విడాకులు కోరడం వంటి పరిణామాలు అతడిని తీవ్ర ఆవేశానికి గురిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

హత్యల అనంతరం రాజ్‌కుమార్ మూడు మొబైల్ ఫోన్లు, 12 సిమ్ కార్డులను వినియోగిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల బహుమతి కూడా ప్రకటించారు. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి వెంట, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జీలు, హోటళ్లలో విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులకు, చివరకు పెంజర్లలో అతడు చనిపోవడంతో ఈ వేట ముగిసింది. కేసుపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.