Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertTrending Today

భూమనపై ఓంకార్ విమర్శలు

తిరుమల: తిరుమలలో వైసీపీ నేతలు అక్రమంగా దుకాణాలు నిర్వహిస్తున్నారని, ఇందుకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏర్పాటైన అక్రమ దుకాణాలపై ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తిరుమల బాలాజీ నగర్ నివాస ప్రాంతాల్లో అక్రమ దుకాణాలు ఏర్పాటు చేశారని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా తిరుమలలో పరిస్థితి మారలేదని అన్నారు. గతంలో ఇతర దుకాణాలపై చర్యలు తీసుకున్న అధికారులు, ఇప్పుడు వైసీపీ నేతలకు చెందిన దుకాణాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తిరుమల, తిరుపతిలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున అక్రమ దుకాణాలు ఏర్పడ్డాయని, ముఖ్యంగా క్షేత్రానికి వెళ్లే మార్గంలో ఉన్న సుమారు 15 అక్రమ దుకాణాలను 24 గంటల్లో తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తిరుక్షేత్రాల రక్షణ సమితి ఆధ్వర్యంలో మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే, భూమన కరుణాకర్ రెడ్డి, ప్రశ్న రావణ్ మధ్య ఉన్న సంబంధాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఓంకార్ డిమాండ్ చేశారు.