మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్ అరెస్ట్
బెంగళూరులో ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన డెలివరీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మారతహళ్లి ప్రాంతంలో శనివారం జరిగింది. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ కోసం వచ్చిన 22 ఏళ్ల విజయ్ మల్లికార్జున్ కామత్, అత్యవసరంగా బాత్రూమ్ ఉపయోగించాల్సి ఉందని చెప్పి మహిళ ఇంట్లోకి వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితురాలు ప్రతిఘటించగా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనను మహిళ వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. అనంతరం పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ స్పందిస్తూ, మహిళకు జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. నిందితుడైన డెలివరీ ఏజెంట్‌ను సంస్థ నుంచి తొలగించినట్లు వెల్లడించింది.
