న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్య
హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం దారుణం జరిగింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను దుండగులు పక్కా ప్రణాళికతో కారుతో ఢీకొట్టి హతమార్చడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. శనివారం ఉదయం మొయినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో బయల్దేరుతున్న క్రమంలో.. దుండగులు కారుతో వెనుక నుంచి వచ్చి ఆయన్ను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఘటనా స్థలం నుంచి నిందితులు పరారయ్యారు.ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డయ్యాయి. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే కాపు కాసి, న్యాయవాదిని కారుతో ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో నాంపల్లి పోలీసులు మొదట ఈ ఘటనపై ‘హిట్ అండ్ రన్’ కేసు నమోదు చేసినప్పటికీ, సీసీటీవీ ఆధారాలను పరిశీలించిన తర్వాత దీన్ని ‘హత్య కేసు’గా మార్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కారు నంబర్‌ను ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, భూ వివాదాల కారణాల వల్లే నిందితులు కాజా మొయినుద్దీన్‌ను లక్ష్యంగా చేసుకొని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నగరంలో వరుసగా న్యాయవాదులపై జరుగుతున్న ఇటువంటి దాడులపై తోటి న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుల్లో ప్రజల తరఫున వాదించే తమకే సరైన రక్షణ కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

