ఎబోలా కట్టడికి వ్యాక్సిన్..!
ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ కట్టడికి అంతర్జాతీయ వైద్య రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న అరుదైన ప్రాణాంతక ‘బందిబుగ్యో’ ఎబోలా స్ట్రెయిన్‌ను అడ్డుకునేందుకు యూకేలోని ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మొట్టమొదటి వ్యాక్సిన్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో ఎబోలాలోని ‘జైర్’ రకానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఈ నిర్దిష్ట బందిబుగ్యో స్ట్రెయిన్‌కు ఇప్పటివరకు ఎలాంటి టీకా లేదు. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న టీకా ప్రస్తుతం జంతువులపై ప్రయోగాల దశలో ఉంది. ఈ పరీక్షలు విజయవంతమైతే రాబోయే రెండు, మూడు నెలల్లోనే మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన భారత్‌కు చెందిన ‘సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’.. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకోవడం విశేషం.

