ఈ20 ఇంధనంపై నితిన్ గడ్కరీ వివరణ
వాహనాల్లో ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్) వినియోగంపై వస్తున్న విమర్శలకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. వాహనాల్లో తలెత్తే ప్రతి సమస్యకు ఇథనాల్‌నే కారణంగా చూపడం సరికాదని స్పష్టం చేశారు. ఇటీవల యూట్యూబర్ సౌరవ్ జోషి తన మెర్సిడీజ్-బెంజ్ ఎస్‌యూవీలో ఈ20 ఇంధనం వాడిన తర్వాత మైలేజీ తగ్గడంతో పాటు ఇంజిన్ సమస్యలు వచ్చాయని పేర్కొనడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన మెర్సిడీజ్-బెంజ్ ఇండియా, తమ బీఎస్-6 పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి అనుకూలంగా రూపొందించబడినవేనని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో గడ్కరీ మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అనుసరిస్తోందన్నారు. ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.
ప్రతి వాహనంలో ఏదో ఒక సమయంలో సాంకేతిక సమస్యలు రావడం సహజమని, వాటిని వెంటనే ఇథనాల్‌తో అనుసంధానం చేయడం తగదన్నారు. సమస్య తలెత్తితే ముందుగా వాహనాన్ని సాంకేతికంగా పరిశీలించాలని సూచించారు.
ఈ20 ఇంధనం కొత్త, పాత వాహనాలకు సురక్షితమేనని గడ్కరీ పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని, వాస్తవాల ఆధారంగానే చర్చ జరగాలని ఆయన కోరారు.

