అక్రమ కేసులపై కాకాణి ఆగ్రహం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
‘ప్రశ్న రావణ్’ అనే యూట్యూబర్‌పై నమోదైన కేసులను ఆయన ఖండించారు. రావణ్‌కు వైఎస్సార్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదని, గతంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు అనుకూలంగా అనేక వీడియోలు చేశాడని తెలిపారు. ప్రస్తుతం అతనిపై టీడీపీలోనే చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేశారని కాకాణి ఆరోపించారు. ఆలయాలకు వచ్చే భక్తుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని, గతంలో జరిగిన కొన్ని ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణనష్టం సంభవించిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేసులను ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను అనుమతించి కేసును కొట్టివేసిందని కాకాణి తెలిపారు. ఈ తీర్పు అక్రమ కేసులను ఎదుర్కొంటున్న వారికి న్యాయపరంగా ధైర్యాన్నిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

