Home Page SliderInternationalNews

టర్కీపై ఎఫ్ – 35 నిషేధం ఎత్తివేతకు ట్రంప్ యోచన?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీపై విధించిన ఎఫ్ -35 స్టెల్త్ ఫైటర్ జెట్ నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నాటో సదస్సు సందర్భంగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో జరగనున్న సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

రష్యా నుంచి ఎస్- 400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన నేపథ్యంలో 2019లో అమెరికా టర్కీని ఎఫ్ -35 సంయుక్త కార్యక్రమం నుంచి తప్పించింది. ఎఫ్ -35 యుద్ధ విమానాలు, ఎస్ -400 వ్యవస్థలు ఒకేసారి ఉపయోగిస్తే కీలక సాంకేతిక సమాచారం రష్యాకు చేరే ప్రమాదం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా టర్కీ వద్ద ఉన్న ఎస్- 400 వ్యవస్థలను మూడో దేశానికి బదిలీ చేయడం లేదా వాటిని నిర్వీర్యం చేసే ప్రత్యామ్నాయాలపై అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ అంశాన్ని రక్షణ శాఖ సమీక్షిస్తోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

అయితే టర్కీకి మళ్లీ ఎఫ్ -35 విమానాల సరఫరాను పునరుద్ధరించడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. నాటో సదస్సులో ఈ అంశంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.