Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

సింగరేణి భవిష్యత్తుకు కేంద్రం భరోసా

సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు సంస్థ భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కేలా కేంద్రం చొరవ తీసుకుందని ఆయన తెలిపారు. దీనివల్ల మరో 35 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు లభించడంతో పాటు, సుమారు రూ.75 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు.

అదే విధంగా తాడిచెర్ల -2 కోల్ బ్లాక్‌ను కూడా సింగరేణికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ బ్లాక్ ద్వారా 40 నుంచి 50 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

తెలంగాణ ప్రజలతో సింగరేణికి విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్న కిషన్ రెడ్డి, సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు బ్లాక్‌ల వేలంలో కూడా సింగరేణి పాల్గొనేలా కృషి చేస్తానన్నారు. కొత్త కోల్ బ్లాక్‌ల కేటాయింపుతో సింగరేణి భవిష్యత్తు మరింత బలోపేతం కావడంతో పాటు, సంస్థ ఆదాయం, బొగ్గు ఉత్పత్తి, కార్మికుల ఉపాధికి దీర్ఘకాలిక భరోసా లభించనుందని ఆయన పేర్కొన్నారు.