crimeHome Page SliderInternationalTrending Today

జైలులో కాల్పులు.. 25 మంది మృతి

శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని నీగొంబో జైలులో రెండు డ్రగ్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రక్తపాతానికి దారితీసింది. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా ఉన్నట్లు నీగొంబో జిల్లా ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.

ఆదివారం ప్రారంభమైన వివాదం సోమవారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఖైదీలు, జైలు అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపాయి. దీంతో జైలు పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

గాయపడిన వారిని నీగొంబో, కొలంబో నేషనల్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో మహిళా ఖైదీలు నిరసనగా జైలు పైకప్పు ఎక్కగా, పైకప్పు కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

సుమారు 1,800 మంది ఖైదీలు ఉన్న నీగొంబో జైలులో జరిగిన ఈ ఘటన గత ఐదేళ్లలో అత్యంత ఘోరమైన జైలు అల్లర్లలో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. ఖైదీల బంధువులు జైలు బయట ఆందోళనకు దిగగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జైళ్ల శాఖ తెలిపింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.