‘సీఎంను నిర్ణయించేది సోషల్ మీడియా కాదు’..కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం కావస్తున్నా.. తదుపరి సీఎం, శాఖల కేటాయింపులపై పార్టీల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. మరోవైపు.. మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నా.. రేసులో కొత్తగా మురళీధర్ మోహోల్ పేరు తెర పైకి వచ్చింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి మురళీ ధర్ మోహోల్ స్పందించారు. సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, తదుపరి సీఎంను నిర్ణయించేది మీడియా కాదు, అధిష్టానం అని పేర్కొన్నారు. బీజేపీ పుణె ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.