BusinessHome Page SliderInternational

కృత్రిమ మేధతో కోవిడ్ తరహా ముప్పు?

. ‘ఆంత్రోపిక్’ కో ఫౌండర్ ఆందోళన

శరవేగంగా విస్తరిస్తోన్న కృత్రిమ మేధ (AI) సాంకేతికత తన తయారీదారులనే ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రముఖ అమెరికన్ ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్’ కో-ఫౌండర్ జాక్ క్లార్క్, ఆ సంస్థ సీఈఓ డారియో అమోడెయ్ భవిష్యత్తులో మానవాళికి ఇది పెను ముప్పుగా మారనుందని హెచ్చరిస్తున్నారు. దీనిని ఏకంగా మహమ్మారి కోవిడ్‌తో పోల్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇటీవల జాక్ క్లార్క్ చేసిన ప్రసంగం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఏఐ పురోగతిని, దాని సామర్థ్యాన్ని ఇంకా చాలామంది అంచనా వేయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఏఐకి సిద్ధం కాకపోవడం అంటే.. కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేకపోవడమేనని ఆయన విశ్లేషించారు.

మనుషులను మించిన సామర్థ్యం ఉన్న ఈ టెక్నాలజీతో మానవ మనుగడకే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. “మనం చూస్తూ ఉండిపోయి, ఏఐ తన సామర్థ్యాలను పెంచుకోవడానికి అనుమతిస్తూ పోతే.. చివరకు తర్వాతి పరిణామాలకు విచారించాల్సిన పరిస్థితి వస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఏఐ అభివృద్ధిని కాస్త నెమ్మదింపజేయగలిగితేనే మానవాళికి మంచిదని జాక్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. కానీ, ప్రస్తుత వాణిజ్య, ఆర్థిక పరిస్థితుల్లో అది అసాధ్యంగా కనిపిస్తోందని విశ్లేషించారు. ఈ టెక్నాలజీపై ఆధిపత్యం కోసం ఒక కంపెనీపై మరో కంపెనీ, ఒక దేశంపై మరో దేశం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ ‘రేస్’ వల్ల ఏఐ సామర్థ్యాలను గుడ్డిగా పెంచుకుంటూ పోవడమే తప్ప.. నియంత్రణ గురించి ఎవరూ ఆలోచించే పరిస్థితిలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ కూడా గతంలో ఇలాంటి హెచ్చరికలే చేశారు. ‘ది అడాల్‌సెన్స్ ఆఫ్ టెక్నాలజీ’ పేరిట రాసిన సుదీర్ఘ వ్యాసంలో ఆయన ఏఐ భవిష్యత్తు, ముప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర విశ్లేషణ చేశారు.
అత్యంత శక్తిమంతమైన సాంకేతికతను చేజిక్కించుకునే దశలో మనం ఉన్నామని, ఇది మానవజాతికి ఒక అగ్నిపరీక్ష లాంటిదని పేర్కొన్నారు. ఇంతటి మహాశక్తిని నిర్వహించే పరిపక్వత మన సామాజిక, రాజకీయ వ్యవస్థలకు ఉందో లేదోనన్న తీవ్ర సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి ఏఐ అనేది కేవలం ఒక ఉత్పాదక సాధనం మాత్రమే కాదు.. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ మార్కెట్లను సమూలంగా మార్చేయగల ఒక అస్త్రం. జాక్, డారియోల హెచ్చరికల నేపథ్యంలో.. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు కేవలం ఆర్థిక లాభాల కోసమే కాకుండా ఏఐ నియంత్రణ, భద్రతా ప్రమాణాలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే ఈ సాంకేతిక విప్లవం భవిష్యత్తులో ఒక తీవ్ర సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.