Home Page SliderNewsNews AlertTelangana

బావిలో దూకి తల్లి, కుమార్తె మృతి, కుమారుడికి పునర్జన్మ

వికారాబాద్‌ (ఏడీఎన్ఎన్) – వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె మృతిచెందగా, కుమారుడు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. యలాల్ మండలానికి చెందిన ఊరుబాటి సుధాకర్ కుటుంబం శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో తోటపనులు చేస్తూ జీవిస్తోంది. సుధాకర్ మద్యానికి బానిసై తరచూ భార్య వసంతను వేధించేవాడని సమాచారం. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన వసంత తన కుమార్తె నవ్య, కుమారుడు వేణుతో కలిసి అర్ధరాత్రి సమీపంలోని బావిలోకి దూకింది.

బావిలో పడిన సమయంలో వేణుకు చెట్టు కొమ్మ అందడంతో దానిని పట్టుకుని సుమారు అరగంట పాటు ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు వెతుకుతూ రావడంతో బాలుడి అరుపులు విని సుధాకర్ బావిలోకి దిగి అతడిని కాపాడాడు. అయితే అప్పటికే వసంత, నవ్య మృతిచెందారు.

సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.