విమానాలు ధ్వంసం చేశామన్న ఇరాన్
అమెరికా –ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన యుద్ధ, ఇంధన రవాణా విమానాలు ధ్వంసమైనట్లు కూడా ఇరాన్ పేర్కొంది. అయితే ఈ వాదనపై అమెరికా నుంచి స్వతంత్ర ధృవీకరణ ఇంకా రాలేదు.
అమెరికా దాడుల్లో ఇరాన్ పౌరులు మృతిచెందినందుకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. అలాగే సిరియాలోని అల్- తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
మరోవైపు, తమ గగనతలంలోకి వచ్చిన మూడు ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. అమెరికా దాడులు కొనసాగితే హర్మూజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

