శంషాబాద్‌లో రూ.1,000 కోట్ల భూ కుంభకోణం
మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో 180 ఎకరాల భారీ భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెద్దషాపూర్ పరిధిలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ భారీ ల్యాండ్ స్కామ్‌లో స్థానిక రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి పూర్తిగా సహకరించారని ఆయన ధ్వజమెత్తారు. వివాదాస్పదంగా మారిన ఈ 180 ఎకరాల భూమిపై గతంలోనే సమగ్ర విచారణ జరిగిందని, అదంతా ప్రభుత్వ భూమేనని స్పష్టం చేస్తూ ఆర్డీవో గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయితే, ఉన్నతాధికారి అయిన ఆర్డీవో ఇచ్చిన అఫీషియల్ ఆర్డర్‌ను పూర్తిగా ధిక్కరిస్తూ.. స్థానిక ఎమ్మార్వో (తహసీల్దార్) ఆ విలువైన భూములను ప్రైవేటు వ్యక్తుల పరంచేశారని ఆరోపించారు. రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్న ల్యాండ్‌ను, ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూమి అని ధృవీకరించడానికి ఒక తహసీల్దార్‌కు ఎక్కడి నుంచి అధికారాలు వచ్చాయని ఆయన నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సొత్తును కాపాడాల్సిన బాధ్యత గల అధికారులే ఇలాంటి భారీ కుంభకోణాలకు తెరలేపడం దుర్మార్గమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు తహసీల్దార్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ భూ దోపిడీ వెనుక ఉండి లబ్ధి పొందిన అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

