Andhra PradeshBreaking Newshome page slider

దేవుడి పేరుతో దారుణ రాజకీయాలు..

రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వం దేవుడి పరువును రోడ్డు మీదకు లాగిందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సీబీఐ సమర్పించిన నివేదికపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై ఆమె నిప్పులు చెరిగారు.

తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదికతో స్పష్టమైందని రోజా పేర్కొన్నారు. “రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన శ్రీవారి లడ్డూపై అపవాదు వేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారు. దేవుడిని కూడా వదలకుండా రాజకీయాలు చేస్తున్న కూటమి నేతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కచ్చితంగా శిక్షించాలి,” అని ఆమె డిమాండ్ చేశారు.

“చంద్రబాబు ప్యాకేజీ అందగానే పవన్ ఊగిపోతుంటారు. సనాతన ధర్మం ముసుగులో వీరంతా ప్యాకేజీల కోసం ఆడే డ్రామా ఆర్టిస్టులు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పే పవన్, ఇప్పుడు ఏ గుడి మెట్లు కడుగుతారో చెప్పాలి. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత వీరికి ఉందా?,” అని నిలదీశారు. తప్పుడు ప్రచారం చేసిన వారి నోర్లను పినాయిల్‌తో కడగాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆయన కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలని రోజా అన్నారు. “విజయవాడ వరదల్లో ప్రజలు మునిగిపోయినప్పుడు చంద్రబాబు, ఇతర మంత్రులు హైదరాబాద్‌లో ఉండి కాలక్షేపం చేశారు. వీరికి ప్రజల పట్ల గానీ, దేవుడి పట్ల గానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కేవలం అధికార దాహంతోనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు,” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీవారి భక్తులకు చేసిన అన్యాయానికి చంద్రబాబు, పవన్ లు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు.