Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

హోంగార్డులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న పేర్ని నాని

మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం బందరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని పలు వర్గాలతో పాటు హోంగార్డుల పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, ప్రభుత్వంలో తెరపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక నారా లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు.

హోంగార్డుల సమస్యలను ప్రస్తావించిన పేర్ని నాని, గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తుచేశారు. అప్పట్లో హోంగార్డుల వేతనాన్ని రూ.18 వేల నుంచి రూ.21 వేలకు పెంచడంతో పాటు, నెలకు రెండు రోజుల సెలవులను కూడా కల్పించారని తెలిపారు.

కానిస్టేబుళ్లతో సమానమైన బాధ్యతలు నిర్వహిస్తున్న హోంగార్డుల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు కనిపించడం లేదన్నారు.

హోంగార్డుల వేతనాలు, ఇతర సౌకర్యాలపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.