ఖమ్మం జోరు.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం
హైదరాబాద్‌లో జరుగుతున్న టీజీ20 లీగ్- 2026లో ఖమ్మం ఏసెస్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ విజయంతో ఖమ్మం ఐదో గెలుపుతో 10 పాయింట్లు సాధించగా, మెదక్ వరుసగా ఆరో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఓపెనర్ హిమతేజ అద్భుతంగా ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 103 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ప్రతీక్ రెడ్డి 32 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులకే పరిమితమైంది. శృంజిత్ రెడ్డి 60 పరుగులతో పోరాడగా, ఇషాన్ శర్మ 15 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించాడు. నమన్ అగర్వాల్ (32), సూర్య తేజ (26) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.
ఖమ్మం బౌలర్లలో విద్యానంద రెడ్డి, వాఫి కచ్చి, హర్షిత్ సాయి రెండేసి వికెట్లు పడగొట్టగా, వేద్ రెడ్డి ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో ఖమ్మం ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టగా, మెదక్ టోర్నీకి వీడ్కోలు పలికింది.

