జ్యోతిష్యుడికి కీలక పదవి: విజయ్ నిర్ణయంపై రాజకీయ దుమారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD – Political) గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెట్రివేల్ గత కొంతకాలంగా విజయ్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ‘సునామీ’ విజయాన్ని నమోదు చేస్తుందని ఆయన ఏడాది క్రితమే జోస్యం చెప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి, కాంగ్రెస్ మరియు ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు విజయ్ ఆయనకు అధికారికంగా రాజకీయ సమన్వయకర్త హోదా కల్పించడం చర్చనీయాంశమైంది
విజయ్ నిర్ణయంపై మిత్రపక్షమైన కాంగ్రెస్ శిబిరంలో అసహనం వ్యక్తమవుతోంది. ద్రవిడ రాజకీయాలు హేతువాదంపై ఆధారపడి ఉంటాయని, ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. యువత మార్పు కోరుకుంటున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు పాత పద్ధతులను ప్రోత్సహించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు
మరోవైపు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన పరిపాలనలో దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలకు మరియు బస్టాండ్‌లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 ప్రభుత్వ మద్యం షాపులను (TASMAC) రెండు వారాల్లోగా మూసివేయాలని ఆయన ఆదేశించారు.
ఒకవైపు సంస్కరణలు, మరోవైపు సంప్రదాయ నమ్మకాలతో విజయ్ సాగిస్తున్న ఈ ‘కొత్త తరహా రాజకీయం’ తమిళనాట ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

