తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే జోసెఫ్ విజయ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా తొలి అడుగు వేశారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు మరియు బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలపై సర్వే నిర్వహించగా..ప్రార్థనా మందిరాల సమీపంలో 276 దుకాణాలు, విద్యాసంస్థల సమీపంలో 186 దుకాణాలు, బస్టాండ్‌ల సమీపంలో 255 దుకాణాలను గుర్తించారు. ఈ 717 దుకాణాలను రాబోయే రెండు వారాల్లోగా పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 4,765 రిటైల్ మద్యం దుకాణాలు ఉండగా, ప్రజా ఫిర్యాదులు మరియు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మద్యరహిత తమిళనాడు దిశగా సీఎం విజయ్ తీసుకున్న ఈ ‘బిగ్ మూవ్’ పట్ల ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

