Home Page SliderNationalNewsPoliticsTrending Today

విజయ్.. నా కాలేజీ ఫ్రెండే: ఉదయనిధి

చెన్నై(ఏడీఎన్ఎన్):
తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారంం ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీవీకే సీనియర్ నేత జేసీడీ ప్రభాకర్ స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నిక ఆ పార్టీకి శుభారంభమైంది. అయితే మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన పాత మిత్రుడు విజయ్‌పై ఆయన కురిపించిన విమర్శనాత్మక అభినందనలు రాజకీయ వేడిని పెంచాయి. సభలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తామిద్దరం చెన్నైలోని లయోలా కాలేజీలో కలిసి చదువుకున్నామని చెబుతూనే, పాలనా వ్యవహారాల్లో తనకు ఉన్న అనుభవాన్ని నొక్కి చెప్పారు. ‘మేమిద్దరం కాలేజీలో క్లాస్‌మేట్స్ కావచ్చు, కానీ ప్రభుత్వ నిర్వహణలో మాత్రం నేనే విజయ్ కంటే సీనియర్’ అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం స్నేహపూర్వక సరదా వ్యాఖ్యేనని కొందరు అంటుంటే, విజయ్ రాజకీయ పరిణతిని ప్రశ్నించేందుకే ఉదయనిధి ఇలా అన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయనిధి తన ప్రసంగంలో మరోసారి వివాదాస్పద ‘సనాతన ధర్మం’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపినప్పటికీ, ఆయన వెనక్కి తగ్గలేదు. దేశాన్ని విభజించే శక్తులను అడ్డుకోవడంలో విజయ్ ప్రభుత్వం తమ సలహాలు తీసుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా సనాతన ధర్మ నిర్మూలన విషయంలో డీఎంకే మార్గదర్శకత్వంలో కొత్త ప్రభుత్వం నడవాలని ఆయన కోరడం అసెంబ్లీలో కలకలం రేపింది.