home page sliderHome Page SliderNewsPoliticsTelangana

అరెస్ట్‌కు సిద్ధం, ముందస్తు బెయిల్ వేయను


ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల వివాదంలో నమోదైన కేసులపై రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, అయితే తాను అరెస్ట్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో తాను ఎలాంటి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదని, భవిష్యత్తులో కూడా వేయబోనని తేల్చి చెప్పారు. అలాగే కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని, తాను ఎక్కడికీ పారిపోకుండా ఇంట్లోనే ఉంటానని పోలీసులకు సవాల్ విసిరారు.

తన సుదీర్ఘ జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయని, కేవలం జైలు జీవితం అనే అనుభవం మాత్రమే మిగిలి ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. తనకు విద్యార్థి ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, చట్టసభలు, మీడియా రంగంలో పనిచేసిన విస్తృతమైన అనుభవాలు ఉన్నాయన్నారు. ఒకవేళ పోలీసులు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపితే, భవిష్యత్తులో తాను రాసుకోబోయే ఆత్మకథకు అదొక పరిపూర్ణమైన అధ్యాయంగా మారుతుందని పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్‌పై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన జనసేన పార్టీ కూడా ఆయన క్షమాపణను ఆమోదిస్తూ వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ తన అరెస్టుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు వచ్చారన్నది అబద్దం

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ రాజకీయ ఆరోపణలు, కేసుల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఏపీ పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే తెలంగాణకు చేరుకున్నారన్న వార్తలతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు.. ముందస్తు జాగ్రత్తగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి చేరుకుని ఆయనకు రక్షణ కల్పించారు.