Andhra PradeshHome Page SliderNews AlertPolitics

ఫేక్ వీడియోలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఇచ్చిన ఒక హామీని వక్రీకరించి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై రాష్ట్ర ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలను ఎడిట్ చేసి, అసత్యాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తమ నీచపు అలవాట్లను మార్చుకోవడం లేదని విమర్శించారు. మార్చి 30న తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ముక్కర అంబిక అనే లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లిన సీఎం, ఆమె భర్త ఆటో డ్రైవర్ అని తెలుసుకున్నారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో, వారికి ఒక ‘బ్యాటరీ ఆటో’ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను అక్కడికక్కడే ఆదేశించారు. ఇది ఒక ఆటో డ్రైవర్ కుటుంబానికి ప్రభుత్వం అందించిన భరోసా. అయితే, సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వస్తుండగా.. ఎదురుగా ఉన్న మరో మహిళ తన చదువుకున్న కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఈ రెండు వేర్వేరు సంఘటనలను కలిపి, ‘చదువుకున్న యువకుడికి సీఎం ఆటో కొనిపిస్తారట’ అంటూ అపహాస్యం చేస్తూ కొందరు కావాలని ఎడిట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు. దీనిపై గతంలోనే ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చినప్పటికీ, మళ్లీ అదే అబద్ధాన్ని ప్రచారం చేయడం దురుద్దేశపూర్వకమని లోకేశ్ మండిపడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.