Ex-gratiaTelanganaTGRTC

శంకర్ గౌడ్ ది ప్రభుత్వ హత్యే: బండి సంజయ్

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన మండిపడ్డారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికులను మభ్యపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికుల పక్షాన బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, రెండు పీఆర్సీ బకాయిలను చెల్లిస్తామని కాంగ్రెస్ తన ‘అభయహస్తం’ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్న బండి సంజయ్, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకొని కుటుంబాలను రోడ్డున పడేయవద్దని, ధైర్యంగా ఉండి పోరాడాలని ఆయన కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.