నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో తెలంగాణ 13వ స్థానం
పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు దేశవ్యాప్తంగా 13వ స్థానం లభించింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ –2026’ నివేదికలో తెలంగాణకు 100కు 47.3 మార్కులు వచ్చాయి. ఈ జాబితాలో గుజరాత్ తొలి స్థానంలో నిలవగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ టాప్ -5లో చోటు దక్కించుకున్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలను మొత్తం 84 సూచికల ఆధారంగా నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్ రూపొందించింది. ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ఆర్థిక ఆరోగ్యం వంటి విభాగాల్లో తెలంగాణకు మంచి మార్కులు లభించాయి. ముఖ్యంగా టీఎస్ -ఐపాస్ దేశంలోనే అత్యంత సమర్థవంతమైన సింగిల్ విండో వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
కొన్ని కేటగిరీల్లో తెలంగాణకు లభించిన మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కేటగిరీ వైజ్ మౌలిక వసతులకు – 10.5 మార్కులు, కేటగిరీ వైజ్ వ్యాపార వాతావరణానికి – 7.8 మార్కులు, కేటగిరీ వైజ్ వనరులు – 6.8 మార్కులు, కేటగిరీ వైజ్ ప్రభుత్వ విధానాలు – 3.8 మార్కులు, కేటగిరీ వైజ్ నియంత్రిత సౌలభ్యాలు – 7.5 మార్కులు, కేటగిరీ వైజ్ సంస్థాగత వాతావరణం – 2.0 మార్కులు, కేటగిరీ వైజ్ ఆర్థిక ఆరోగ్యం – 4.7 మార్కులు, కేటగిరీ వైజ్ పర్యావరణ స్థిరత్వం – 3.8 మార్కులు.
అయితే, మౌలిక సదుపాయాలు, సంస్థాగత వాతావరణం వంటి అంశాల్లో రాష్ట్రం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. తెలంగాణలో సేవారంగం ప్రధాన బలంగా ఉందని, ఔషధాలు, బయోటెక్నాలజీ వంటి పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. పరిపాలనా సామర్థ్యం, ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిస్తే రాష్ట్రానికి ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశముందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.

