అమరావతి అంటేనే ‘ఆర్గనైజ్డ్ కరప్షన్’
రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో ‘ఆర్గనైజ్డ్ కరప్షన్’ జరుగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక ‘గుదిబండ’గా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి, చంద్రబాబు మనుషులకు మరో నీతిని వర్తింపజేస్తూ వ్యవస్థీకృత వివక్షకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని అమరావతిలోని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి అత్యంత కీలక ప్రాంతాల మధ్య ఐదు ఎకరాల విస్తీర్ణంలో, సుమారు లక్షన్నర చదరపు అడుగులతో నిర్మించుకుంటున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఏడాది తిరగకముందే చంద్రబాబు ఇల్లు పూర్తి కావస్తున్నా, రాజధాని నిర్మాణం మాత్రం ఎక్కడిదక్కడే ఉందని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులు ఎవరూ ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించారని, సామాన్య రైతులకు ఇలాంటి కీలక ప్రాంతాల్లో ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.రాజధానిలోని అత్యంత విలువైన ప్లాట్లను చంద్రబాబు తన బినామీలకు, సన్నిహితులకు కట్టబెడుతున్నారని నాని ఆరోపించారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన, బెజవాడ రమేష్‌కు ప్రధాన రోడ్ల మధ్యలో ప్లాట్లు ఎలా కేటాయించారని నిలదీశారు. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలేదని, రెండో విడత భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రెండో విడతలో బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం వేల కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీరని భారం వేస్తోందని, దీనివల్ల కేవలం చంద్రబాబు మనుషులకే ప్రయోజనం చేకూరుతోందని నాని విమర్శించారు. అద్దాల మేడల కోసం రూ. 2,500 కోట్లు కేటాయించడం భారీ దోపిడీకి నిదర్శనమని అన్నారు. అలాగే, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైతుల పట్ల అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ నెలలో వర్షాలు పడితే రాజధాని ప్రాంతంలో మళ్ళీ నీళ్లు నిలబడతాయని, ప్రభుత్వం ఆరు నెలల్లో ఏదో చేసేస్తామని చెప్పడం కేవలం భ్రమ అని ఆయన హెచ్చరించారు.

