2029లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం!
రాష్ట్రంలో జమిలి ఎన్నికలు 2029లో వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎన్నికల విధానం ఒక ‘జెమిని సర్కస్’లా ఉందని, ఎన్నికల్లో గెలవడానికి ఆ పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించారని, బీజేపీకి పట్టులేని చోట్ల కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారమే అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. లోక్‌సభ స్థానాల పునర్విభజన విషయంలో దామాషా పద్ధతి పాటించాలని, సీట్ల పెంపుపై ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
చర్చలు జరపాలని మోదీకి లేఖ రాశా
పాలనాపరమైన అంశాలపై స్పందిస్తూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే రోజున విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయిస్తామని, ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రధాని పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చారు. వ్యవసాయ రంగంలో పంట మార్పిడిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మావోయిస్టు వ్యాఖ్యలపై ప్రధానికి సీఎం రేవంత్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మావోయిస్టు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని మావోయిస్టులతో ముడిపెట్టడం దురదృష్టకరమని, మనుషుల ప్రాణాల విలువ తెలిసిన పార్టీగా తాము మావోయిస్టుల లొంగుబాటుకు చొరవ తీసుకున్నామని గుర్తుచేశారు. బుల్లెట్ కంటే బ్యాలెట్‌కే ప్రాధాన్యతనిచ్చి, మావోయిస్టులు పోరాడుతున్న సమస్యల పరిష్కారానికి తాము చట్టాలు చేశామని పేర్కొన్నారు. దీనివల్లనే రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం తగ్గిందన్నారు. ముస్లింలు, మావోయిస్టులు ఈ దేశంలో భాగస్వాములని, ప్రజలను విడగొట్టేలా కాకుండా కలిపి ఉంచేలా ప్రధాని మాట్లాడాలని హితవు పలికారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే మోదీ ఇటువంటి విభజన వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
అభివృద్ధి కోసం కలిసుందామని పిలుపు
మరోవైపు అభివృద్ధి విషయంలో ప్రధానితో కలిసి నడిచేందుకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిన్నటి అధికారిక కార్యక్రమంలో ప్రధాని ఇచ్చిన ‘హమ్ సే మిలో’ (మమ్మల్ని కలవండి) పిలుపును రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాజకీయాలు వేరైనా, అభివృద్ధి మరియు సంక్షేమం కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. దేశం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా సాగాలన్నా, ‘విజన్ 2047’ సాధించాలన్నా కేంద్ర-రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను వివరించేందుకు ప్రధాని తమకు రెండు గంటల సమయం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. గతంలో ఎన్నిసార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల అభివృద్ధికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించినట్లు తెలిపారు. పార్టీల సిద్ధాంతాలు వేరైనా, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం తన పెద్దరికాన్ని చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఫార్ములా-ఈ రేస్ కేసుపై స్పందిస్తూ..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం ఎవరిపై కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, అంతా చట్టప్రకారం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఈ కేసులో సుమారు ₹55 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలపై విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిందని సీఎం వివరించారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ని ప్రధాన నిందితుడిగా (ఏ1), ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను రెండో నిందితుడి(ఏ2)గా చేర్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజకీయ కక్షసాధింపు ఉండవు
నిందితుల అరెస్ట్ అనేది పూర్తిగా దర్యాప్తు సంస్థలు, కోర్టుల విచక్షణపైనే ఆధారపడి ఉంటుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేశారన్న సాక్ష్యాల ఆధారంగానే విచారణ సాగుతోందని, విచక్షణారహితంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసును బీఆర్ఎస్ నేతలు ‘రాజకీయ కక్ష’గా అభివర్ణిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ప్రభుత్వం పారదర్శకంగానే వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

