చెత్త సేకరించే అమ్మాయికి అంతర్జాతీయ అవార్డులు
చెత్తను సేకరించే పని చేసిన కుటుంబాలలోని అమ్మాయిలు కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగగలమని నిరూపిస్తున్నారు అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూస్తే. హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లోని పిల్లిగుడిసెల బస్తీలో ఉంటున్న అరిపిన జయలక్ష్మి అనే అమ్మాయి. ఇటీవల అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒకరోజు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హోదాలో పని చేసి, పాస్‌పోర్ట్ ఆఫీసులో విశేష గౌరవాన్ని అందుకుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా పలు విషయాలు తెలుసుకుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో మాట్లాడడం, బ్రిటిష్ హై కమిషనర్‌తో కలిసి కారులో ప్రయాణించడం వంటి ఘనతలు సాధించింది. అంతేకాదు ‘గాంధీ కింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’లో భాగంగా దేశం నుండి ఎంపికైన 10 మంది అమ్మాయిలలో ఒకరిగా 2023లో అమెరికా కూడా వెళ్లి రావడం విశేషం. కొవిడ్ సమయంలో యునిసెఫ్ నుండి వాలంటీర్‌గా కూడా పని చేసింది జయలక్ష్మి. ఈ ఏడాది మహిళా శక్తి పురస్కారం, గతంలో ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డు తీసుకోవడం కూడా ఆమె అఛీవ్‌మెంట్స్‌గా చెప్పవచ్చు. తాను ఏ పని చేస్తున్నా ఆ పనిని ప్రేమిస్తానని, భవిష్యత్తులో యుపీఎస్సీ సాధించాలనేది తన డ్రీమ్ అని చెప్తోంది.