ఫిఫా వరల్డ్ కప్‌లో విషసర్పం కలకలం
ఫిఫా ప్రపంచ కప్ సమరంలో జర్మనీ ఫుట్‌బాల్ జట్టుకు మైదానంలో ఎదురయ్యే ప్రత్యర్థుల కంటే.. మైదానం వెలుపల ఊహించని ఒక వింత శత్రువు ఎదురై హడలెత్తించింది. తాము బస చేస్తున్న శిబిరంలోకి ఒక విషపూరితమైన పాము ఎంట్రీ ఇవ్వడంతో జర్మనీ ప్లేయర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫిఫా వరల్డ్ కప్ కోసం జర్మనీ జట్టు అమెరికాలోని నార్త్ కరోలినాలో గల ‘విన్స్టన్-సేలం’లో తమ బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసుకుంది. అయితే, అక్కడ ప్లేయర్స్ తిరిగే ప్రాంతంలోని గడ్డి కింద ఒక ప్రమాదకరమైన విషసర్పం ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఒక ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం.. జర్మనీ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ అతని సహచర ఆటగాళ్లు చూసింది అత్యంత విషపూరితమైన ‘కాపర్ హెడ్’ పాము అని తేలింది. ఇది నార్త్ కరోలినా ప్రాంతంలో సాధారణంగా కనిపించే భయంకరమైన సర్పంగా గుర్తింపు పొందింది. జర్మనీ వాళ్లకే కాకుండా.. అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకున్న స్విట్జర్లాండ్, నార్వే దేశాల ప్లేయర్లకు కూడా పాములు కనిపించాయని, దీంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురైనట్లు నివేదికలు వచ్చాయి. ఈ వింత అనుభవంపై జర్మనీ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ ఆసక్తికరంగా స్పందించాడు. “సాధారణంగా జర్మనీలో అయితే మేము మ్యాచ్ వ్యూహాలు, ఆటగాళ్ల గాయాలు, తదుపరి ఎదుర్కోబోయే ప్రత్యర్థి గురించి మాత్రమే ఆలోచించి ఆందోళన చెందుతాము. కానీ ఇక్కడికి వచ్చాక.. నడిచేటప్పుడు గడ్డిలో కింద ఏముందో అని కూడా భయంతో ఆలోచించాల్సి వస్తోంది” అని కిమ్మిచ్ వ్యాఖ్యానించాడు. ఈ పాముల కలకలం ఆటగాళ్లను కాస్త భయపెట్టినప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్లేయర్స్ అందరూ సురక్షితంగా ఉన్నారని ఫిఫా వర్గాలు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్లను హడలెత్తించిన ఈ పాము ముచ్చట సాకర్ ఫ్యాన్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

