పాలమూరు-రంగారెడ్డికి సీడబ్ల్యూసీ క్లియరెన్స్ తేవాల్సిందే
రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సెక్రటేరియట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా సీడబ్ల్యూసీ (CWC) క్లియరెన్స్ తీసుకువచ్చే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతగా పూర్తిచేయాలన్నారు. అలాగే, సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సైతం సీడబ్ల్యూసీ క్లియరెన్స్ సాధించే పురోగతిపై చర్చించారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణం ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో, కేవలం రెండు నెలల్లోనే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (DPR) సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా, మరమ్మతులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి, రిపేర్ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు డీపీఆర్ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశంపై మరోసారి కేంద్రం వద్దే తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.

