మోదీ ప్రకటనపై బంగారు వ్యాపారుల బెంబేలు
దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే దిశగా పసిడి దిగుమతులను తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. సోమవారం ట్రేడింగ్ లో ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రధాని ప్రకటనపై జ్యువెలరీ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు మే 12న జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానమంత్రి కార్యాలయాన్ని (PMO) కలవనున్నారు. ప్రముఖ జ్యువెలరీ దిగ్గజం టైటాన్ (Titan) షేర్ విలువ 6 శాతానికి పైగా పడిపోయి రూ.4,230కి చేరింది. మునుపటి ముగింపు ధరతో పోలిస్తే ఒక్కో షేరుపై రూ.283.40 వరకు తగ్గడం గమనార్హం. టైటాన్‌తో పాటు కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీల షేర్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు పౌరులు కనీసం ఏడాది పాటు పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని కోరారు. అలాగే విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గించుకుని స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో 72 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ అనిశ్చితి వల్ల భారత విదేశీ మారక నిల్వలు ఇటీవల 7.794 బిలియన్ డాలర్లు తగ్గి, 690.693 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఏటా 700 నుండి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుండగా, దేశీయంగా ఉత్పత్తి కేవలం 2 టన్నులు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, స్వల్పకాలంలో జ్యువెలరీ రంగానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

