బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ అరెస్ట్..
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇంఛార్జ్ కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా దిలీప్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. అయితే.. కొణతం దిలీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పని చేశారు. ఆసిఫాబాద్ జైనూర్ ఘటనలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు చేసినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆగస్టు 31న ఆదివాసి మహిళపై అత్యాచార ఘటన సంచలనంగా మారింది.
తీవ్రగాయాలతో మహిళ ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహిళపై దాడికి నిరసనగా ఆదివాసీ సంఘాలు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జైనూర్ లో 144 సెక్షలు అమలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా విపత్కర సమయాల్లో వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దిలీప్ ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.