Breaking Newshome page sliderHome Page SliderTelangana

పేర్లు మార్చడం తప్ప, కొత్త పథకాలు ఏవీ?

పార్వతీపురం:పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి మన్యం జిల్లాకు రావడంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని పుష్పశ్రీవాణి అన్నారు. “జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తారని, జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు. కానీ అలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు” అని ఆమె విమర్శించారు.చంద్రబాబు నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వలన జిల్లా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క స్కూల్ తరగతి గది కూడా కట్టలేదని, ఒక్క టేబుల్ కుర్చీ కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. అందుకే, బహిరంగ ప్రదేశంలో క్లాస్ రూమ్ సెట్ వేసుకొని కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.”ఈ ప్రభుత్వంలో విద్యా రంగానికి ఏం చేస్తున్నారో చెప్పలేక పోయారు. వైఎస్ జగన్ కట్టించిన స్కూల్‌లో కార్యక్రమం చేస్తే అభివృద్ధి కనిపిస్తుందని, ఆ భయంతో సినిమా సెట్ వేసుకొని వారి దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారు,” అని పుష్పశ్రీవాణి ఘాటుగా విమర్శించారు.వైఎస్ జగన్ పాలనలోని పథకాల పేర్లు మార్చడం తప్ప, ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పథకాన్ని అయినా తెచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని పాముల పుష్పశ్రీవాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు.