Breaking Newshome page sliderHome Page SliderNational

సుప్రీంకోర్టు కు ఇండిగో సంక్షోభం

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా ఇండిగో విమానాల్లో అంతరాయం కొనసాగుతోంది. శనివారం కూడా పలు ఎయిర్‌పోర్టుల్లో దాదాపు 500కు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో దిల్లీ ఎయిర్‌పోర్టు ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని తెలిపింది . ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు . ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్‌వర్క్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని విమానయాన సంస్థలు నిబంధనలు సరిగా పాటిస్తున్నాయో, లేదో నిర్ధరిస్తామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ, ఎలా తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేశామని, పిల్లలు, వృద్ధులు, పాలిచ్చే తల్లులు, వికలాంగులకు విమానయానంలో ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.