ఇస్లామిక్ పండితుడు నద్వీ ఇకలేరు
అయోధ్య రామజన్మభూమి –బాబ్రీ మసీదు వివాదానికి పరస్పర చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని విశ్వసించిన ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా సల్మాన్ హుసైనీ నద్వీ (72) లక్నోలో కన్నుమూశారు. మత సామరస్యం, శాంతియుత సహజీవనానికి ఆయన చేసిన సేవలు విశేషంగా గుర్తింపు పొందాయి.
లక్నోలోని దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమాతో సుదీర్ఘ అనుబంధం కలిగిన నద్వీ, ఇస్లామిక్ ధర్మశాస్త్రం, అంతర్మత సంభాషణలపై దేశ విదేశాల్లో అనేక ప్రసంగాలు చేశారు. అయోధ్య వివాద సమయంలో హిందూ, ముస్లిం వర్గాలు పరస్పర అవగాహనతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
2018లో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌తో కలిసి వివాదానికి కోర్టు వెలుపల పరిష్కారం కనుగొనేందుకు పలు దఫాలు చర్చలు జరిపారు. అవసరమైతే మసీదును ప్రత్యామ్నాయ స్థలానికి తరలించి, వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి మార్గం కల్పించవచ్చని ఆయన చేసిన ప్రతిపాదన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ అభిప్రాయాల కారణంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డుతో విభేదాలు తలెత్తడంతో ఆయన బోర్డుకు రాజీనామా చేశారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. నద్వీ మృతి పట్ల పలువురు రాజకీయ, మతపెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.

