మూగజీవం.. 13 మందికి పునర్జన్మ
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన జంట భూకంపాల అనంతరం సహాయక చర్యల్లో ‘సునామీ’ అనే శిక్షణ పొందిన శునకం అసాధారణ ప్రతిభ కనబరిచింది. విపత్తు ప్రతిస్పందన బృందానికి చెందిన ఈ ఎనిమిదేళ్ల జాగిలం, తన శిక్షకుడు జార్జ్ బీన్స్‌తో కలిసి శిథిలాల కింద చిక్కుకున్న 13 మంది బాధితులను గుర్తించి వారి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించింది.
తన ఘ్రాణశక్తితో ప్రాణాలతో ఉన్న వారి ఆచూకీని ఖచ్చితంగా గుర్తించిన ‘సునామీ’కి రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి బాధితులను సురక్షితంగా బయటకు తీశాయి. తాజాగా కూలిన ఎనిమిది అంతస్తుల భవనం శిథిలాల కింద చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధుడిని గుర్తించడంలోనూ ఈ శునకం కీలక పాత్ర పోషించింది.
ఒకప్పుడు కారాకస్ వీధుల్లో అనాథగా తిరిగిన ‘సునామీ’ని ఓ మహిళ సంరక్షించి, అనంతరం విపత్తు ప్రతిస్పందన సంస్థకు అప్పగించారు. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన ఈ శునకం గతంలో 2023లో తుర్కియే– సిరియా భూకంపాలు, వెనెజువెలా వరదల సమయంలోనూ సహాయక చర్యల్లో పాల్గొంది.
తాజా ఘటనలో ‘సునామీ’ సేవలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

