ఫేక్ న్యూస్ కేసుల్లో ఏపీ నెం.1
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ ) తాజాగా విడుదల చేసిన 2024 వార్షిక నివేదిక ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో పెరుగుతున్న నేరాల ధోరణిపై ఆందోళనకర విషయాలను శుక్రవారం వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారాలు , సైబర్ నేరాలు , మానవ అక్రమ రవాణా వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రచారాలు చేస్తున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి వరుసలో నిలిచింది. 2024లో ఏపీలో మొత్తం 203 ఫేక్ న్యూస్ కేసులు నమోదు కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇవి కేవలం 139 కేసులుగా మాత్రమే ఉన్నాయి. డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కూడా భారీగా రెచ్చిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలో గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాల రేటు 8 శాతం పెరగడం గమనార్హం.మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. మహిళలు , చిన్నారుల అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాలకు గాను కేవలం 13 జిల్లాల్లో మాత్రమే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి.

