మరో..‘సారీ’..! తమిళ రాజకీయాల్లో హైడ్రామా !
చెన్నై : తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడినా.. రాజకీయ సందిగ్ధత మాత్రం ఇంకా కొనసాగుతోంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ గురువారం చెన్నైలోని రాజ్‌భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను రెండోసారి కలిశారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ఆయన కోరారు. అయితే సంఖ్యాబలం నిరూపించుకోవాలని గవర్నర్ మరోసారి స్పష్టం చేయడంతో విజయ్ కి మళ్లీ నిరాశే మిగిలింది. విజయ్ భేటీపై లోక్‌భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయ్ వద్ద ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ లేదని, పూర్తిస్థాయి సంఖ్యాబలంతో వచ్చినప్పుడే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు.
మెజార్టీ మార్క్ సవాలు
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీ విజయ్‌కి మద్దతు ప్రకటించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో ఆయన ఇంకా వెనుకబడే ఉన్నారు. 118 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన తర్వాతే రావాలని గవర్నర్ గతంలోనే సూచించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు అవకాశం ఇవ్వాలని వీసీకే గవర్నర్‌ను కోరింది. అటు సీపీఐ కూడా సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, అధికారికంగా మాత్రం ఇంకా మద్దతు ప్రకటించలేదు. డీఎంకే సైతం తొలుత విజయ్‌కే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం కాన్వాయ్ తిరస్కరణ
ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ముఖ్యమంత్రి స్థాయి పోలీసు కాన్వాయ్‌ని విజయ్ సున్నితంగా నిరాకరించారు. ప్రమాణ స్వీకారం చేయకముందే అటువంటి భారీ భద్రత తనకు వద్దని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయనకు కేటాయించిన నాలుగు కాన్వాయ్ వాహనాలను పోలీసు శాఖ తిరిగి వెనక్కి తీసుకుంది. గురువారం గవర్నర్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా విజయ్ ప్రభుత్వ వాహనాన్ని కాకుండా తన సొంత వాహనాన్నే ఉపయోగించారు.

